ఎట్టకేలకు విలక్షణ నటుడు కమల్ హాసన్ తన కొత్త పార్టీ పేరును అభిమానుల సమక్షంలో ప్రకటించారు. పార్టీ పేరును 'మక్కల్ నీతి మయ్యం' అని నామకరణం చేసినట్లు ప్రకటించారు. తమిళంలో మక్కల్ నీతిమయ్యం అంటే సెంటర్ ఫర్ పీపుల్స్ జస్టిస్ అని అర్థం. ఇకపోతే పార్టీ జెండా గురించి చూస్తే... ఒక చేతి మణికట్టుని మరో చేయి పట్టుకుని ఉన్న ఆరు చేతులు వున్నాయి.
ఈ ఆరిండిటిలో మూడు ఎరుపు రంగులో వుండగా మరో మూడు తెలుపు రంగులో ఉన్నాయి. ఆ గుర్తు మధ్యలో తెల్లని నక్షత్రం ఉన్నట్లు డిజైన్ చేశారు. పార్టీ పేరును ప్రకటిస్తూ కమల్ హాసన్ ఇలా చెప్పుకొచ్చారు. తను ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తిననీ, తలైవాను మాత్రం కాదని అన్నారు. ఒక్కరోజు ఆట కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పుకొచ్చారు. తనను తాను నాయకుడిగా భావించుకోవట్లేదని అన్నారు.
రాజకీయాల్లోకి వస్తున్న సినీ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్ కాగితపు పూలు వంటివారనీ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విశ్వనటుడు కమల్ హాసన్ కూడా తనదైనశైలిలోస్పందించారు. 'నేను కాగితపు పువ్వును కాదు, విత్తనాన్ని. దానిని నాటి చూస్తే ఏపుగా పెరుగుతా. విత్తనాన్ని ఎవరూ వాసన చూడాల్సిన పని లేదు' అని వ్యాఖ్యానించారు. రాజకీయ రంగంలో కొత్త శకాన్ని ప్రారంభించడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలంటూ ట్వీట్ చేశారు. కాగా కమల్ పార్టీ పవన్ కళ్యాణ్ జనసేనకు కాస్త దగ్గరగా వున్నట్లు అనిపిస్తోంది. లోగో విషయంలో కావచ్చు, విధానాల విషయంలోనూ కావచ్చు.