రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటి నుంచి విశ్వనటుడు కమల్ హాసన్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జరిగే భారీ బహిరంగ సభలో ఆయన తన పార్టీ పేరును ప్రటించనున్నారు. ఇందుకోసం ఆయన మంగళవారం రాత్రే రామేశ్వరం చేరుకున్నారు. ఆ తర్వాత బుధవారం ఉదయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వస్థలం రామేశ్వరం చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను కలుసుకుని, కలాం సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభించారు.
మధ్యలో పలు చోట్ల సభల్లో ప్రసంగించనున్నారు. సాయంత్రం మదురైలో జరిగే భారీ బహిరంగ సభలో కమల్ రాజకీయ పార్టీని ప్రకటించడంతోపాటు పార్టీ పతాకాన్ని పరిచయం చేయనున్నారు. ఈ సభకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.
ఇదిలావుండగా, తన తండ్రి ప్రారంభిస్తున్న రాజకీయ పార్టీలో చేరబోనని తాను కమల్‌హాసన్ కుమార్తె, హీరోయిన్ శృతిహాసన్ అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, 'నాకు రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన లేదు. కానీ, మా నాన్న రాజకీయ ప్రయాణానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అయితే ఆయన వెంట నడిచే ఉద్దేశం లేదు' అని స్పష్టంచేశారు.