సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు జైలుకు వెళతారు : ఆప్ నేత అతిషి

ఠాగూర్

బుధవారం, 22 మే 2024 (10:57 IST)
జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలంతా జైలుకు వెళతారని ఆప్ సీనియర్ మహిళా నేత అతిషి జోస్యం చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ కుంభకోణంలో బీజేపీ నాయకులు జైలుకు వెళ్తారని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు మాత్రమేకాకుండా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు సైతం ఊచలు లెక్కబెడతారని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
 
బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని అతిషి వ్యాఖ్యానించారు. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, కోట్లాది రూపాయల ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణం బయటపడుతుందని అన్నారు. 'మీ అంతం దగ్గర పడింది. ఈ విషయం బీజేపీకి స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం దేశ ప్రజలు వారి మనస్సును మార్చుకున్నారు' అని ఆమె వ్యాఖ్యానించారు.
 
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంపై అతిషి స్పందిస్తూ, హైకోర్టుపై తమకు గౌరవం ఉందని, అయితే కోర్టు నిర్ణయంతో విభేదిస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు. ఎందుకంటే మద్యం కుంభకోణం అంతా బీజేపీ రాజకీయ కుట్ర అని, ఎన్నికల బరిలో ఆప్ని ఓడించలేక ఈడీ, సీబీఐలను బీజేపీ ఉపయోగించిందని ఆమె ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు