సర్ఫ్ ఎక్సెల్‌కు వ్యతిరేకంగా లేచిన ఆన్‌లైన్ ఉద్యమం కాస్తా గురి తప్పి ఎంఎస్ ఎక్సెల్ పీకకు చుట్టుకునేసింది. అయితే దీనిపై ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ సీఈఓ కునాల్ బళ్ స్పందిస్తూ ‘ఈ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు మిత్రమా’ అంటూ ఎంఎస్ ఎక్సెల్, స్నాప్‌డీల్ అనే ఇద్దరు వ్యక్తులు కౌగిళించుకుంటున్న మెమెను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.
వివరాలలోకి వెళ్తే... రాబోయే రంజాన్, హోళీని సమ్మిళితం చేస్తూ హిందూ-ముస్లిం మధ్య స్నేహభావాన్ని చాటే విధంగా సర్ఫ్ ఎక్సెల్ ఓ ప్రకటన రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది ‘లవ్ జిహాద్’ను ప్రేరేపించే విధంగా ఉందని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసారు.
ఇంతకీ ఈ బాధ స్నాప్‌డీల్‌కి ఎలా తెలుసంటే... 2017వ సంవత్సరంలో స్నాప్‌డీల్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్నాప్‌చాట్ అనుకొని చాలా మంది స్నాప్‌డీల్‌కు వ్యతిరేక రివ్యూలు ఇచ్చేసారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తన అనుభవాలతో మైక్రోసాఫ్ట్‌ను స్నాప్‌డీల్‌ను ఓదార్చినట్టు మెమె రూపొందించారు. ఏది ఏమైనప్పటికీ... ఈ ఎక్సెల్‍ల బాధ ఎప్పటికి తీరునో.