రాహుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా బ్లాక్ అవుతుందా?
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:01 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా ఇప్పటికే బ్లాక్ కాగా.. త్వరలో రాహుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా బ్లాక్ అయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్ ఖాతాపై చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్)ఫేస్‌బుక్‌ని ఓ లేఖలో ఆదేశించింది.
ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యుల వివరాలు బహిర్గతమయ్యేలా.. రాహుల్ పోస్ట్ చేసినందుకుగాను ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఫేస్ బుక్ కి రాసిన లేఖలో ఎన్సీపీసీఆర్ పేర్కొంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ పోస్టు చేసిన ఓ వీడియోలో బాధిత బాలిక కుటుంబాన్ని గుర్తించేలా ఉంది. ఆ వీడియోలో బాలిక తల్లితండ్రులు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇది నిర్దేశించిన చట్టాలను ఉల్లంఘించడమే.
జువైనల్ జస్టిస్ యాక్ట్-2015, పోక్సో చట్టం-2012, ఐపీసీలోని నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను రాహుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పై చర్యలు తీసుకోవాలి. సదరు వీడియోను వెంటనే తొలగించాలి అని ఫేస్‌బుక్‌కు రాసిన లేఖలో ఎన్సీపీసీఆర్ పేర్కొంది.