మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర

శుక్రవారం, 3 జనవరి 2020 (22:01 IST)
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రూపాయి క్షీణతతో పసిడి ధర అమాంతం పెరిగింది. ఆ ప్రభావం దేశీయ ధరలపైనా పడింది.

దీంతో బులియన్ మార్కెట్లో పుత్తడి ధర మళ్లీ 40వేల మార్క్ ను దాటింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 752 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 40,652 పలికింది. అటు వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. రూ. 960 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 48,870కి చేరింది.

ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సులేమానిని అమెరికా హత్య చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో పసిడిలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావించారు.

దీనికి తోడు రూపాయి విలువ పతనమవడం కూడా ఈ లోహాల ధరలు పెరగడానికి కారణమైందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు