మూడు ఉడకబెట్టిన కోడిగుడ్ల ధర రూ.1350... జీఎస్టీ అదనం... ఎక్కడ?

శుక్రవారం, 15 నవంబరు 2019 (09:43 IST)
సాధారణంగా స్టార్ హోటళ్ళలో తినుబండరాల ధరలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. బయట మార్కెట్‌లో ఉండే ధరలకు కాస్త రెట్టింపుగానే ఉంటాయి. కానీ, అహ్మదాబాద్‌లోని హయత్ రీజెన్సీ నక్షత్ర హోటల్‌లో మాత్రం ధరలు కాస్తంత విడ్డూరంగా ఉన్నాయి. ఇక్కడ మూడు ఉడకబెట్టిన కోడిగుడ్ల ధర ఏకంగా 1350 రూపాయలు. ఈ బిల్లు చూసిన కస్టమర్‌కు షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత షాక్ నుంచి తేరుకుని ఈ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే.. ఆ బిల్లు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఆ కస్టమర్ ఎవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావ్‌జియానీ. 
 
ఈయన గత మూడు రోజులుగా ఈ హోటల్‌లో బస చేస్తున్నాడు. గురువారం మూడు ఉడకబెట్టిన కోడిగుడ్లతో కూడిన భోజనం ఆర్డర్ ఇచ్చాడు. భోజనం అనంతరం తన చేతిలో పెట్టిన బిల్లును చూసి శేఖర్ విస్తుపోయాడు. షాక్ నుంచి కోలుకునేందుకు కొన్ని నిమిషాలు పట్టిందట.
 
ఉడికించిన మూడు కోడిగుడ్లకు రూ.1350, సర్వీసు చార్జ్‌గా రూ.67.50, సీజీఎస్టీ 9 శాతంతో రూ.127.58, ఎస్‌జీఎస్టీ 9 శాతం కింద రూ. 127.58 కలుపుకుని మొత్తం రూ.1672తో ఇచ్చిన బిల్లు చూసి షాకైన రావ్‌జియానీ.. దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఇప్పుడీ బిల్లు వైరల్ అయింది. 15 రూపాయల కోడిగుడ్లకు రూ.1600 ఏంటంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
 
గతంలో బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌‌కు చండీగఢ్‌లో ఇటువంటి అనుభవమే ఒకటి ఎదురైంది. అక్కడి జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో రెండు అరటి పండ్లు కొన్నందుకు ఏకంగా రూ.442.50 బిల్లు వేశారు. అతడు కూడా ఆ బిల్లును సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన  ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ అధికారులు హోటల్‌కు రూ.25 వేల జరిమానా విధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు