పన్నీర్ వెంట పాండ్యరాజన్‌.. గవర్నర్‌కు శశిలేఖ లేఖ.. ఇక ఆలస్యం చేయవద్దు.. సహనానికీ ఓ హద్దుంది..

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (13:50 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ గవర్నర్ విద్యాసాగర్ లేఖ రాశారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌ శ్రేయ‌స్సు దృష్ట్యా గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు త్వ‌రగా నిర్ణ‌యం తీసుకోవాలని శశికళ తెలిపారు. అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప‌న్నీర్ సెల్వం రాజీనామా చేసి వారం రోజులు గ‌డిచాయ‌ని, రాజీనామాను గ‌వ‌ర్న‌ర్ కూడా ఆమోదించారని ఆమె గుర్తు చేశారు. 
 
త‌న‌కు కావాల‌సిన మెజార్టీ స‌భ్యుల మ‌ద్ద‌తు ఉంద‌ని తాను రెండు రోజుల క్రిత‌మే గ‌వ‌ర్న‌ర్‌కు చెప్పానని తెలిపారు. గ‌వ‌ర్న‌ర్‌ త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకొని ప్ర‌జాస్వామ్యం, ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌తార‌ని తాను ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. తన ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేస్తుండటంపై శశికళ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనకు వెంటనే మరోసారి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని గవర్నర్ డిమాండ్ చేశారు. తనకు సంపూర్ణంగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని మరోసారి స్పష్టం చేశారు.
 
ఈ సందర్భంగా శశికళ మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే కొంత కాలం మాత్రమే వేచి ఉండగలదని పేర్కొన్నారు. సహనానికి ఓ హద్దుందని శశికళ తెలిపారు. అమ్మ ఆత్మ మనతో ఉందని చెప్పారు. 'అమ్మ' జయలలిత తనకు ఎందరో అభిమానులను, మద్దతుదారులను విడిచి వెళ్ళారని చెప్పుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కలలు కంటున్న దివంగత జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వూహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పన్నీర్ శిబిరంలో చేరిపోతున్నారు. దీనికి కొనసాగింపుగా శనివారం ఇద్దరు ఎంపీలు కూడా పన్నీర్‌కు జై కొట్టారు.

వెబ్దునియా పై చదవండి