తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన చిన్నమ్మ (శశికళ) కూర్చోవాలని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి సాక్షిగా ముగ్గురు మంత్రులు ఆకాంక్షించారు. పైగా, ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన పాలన అందించే సత్తా, సీఎం కుర్చీలో కూర్చొనే అన్ని అర్హతలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.
కొత్త సంవత్సరాదిని పురస్కరించుకొని రాష్ట్ర మంత్రులు ఆర్పీ ఉదయకుమార్, కడంబూరు రాజు, సేవూరు రామచంద్రన్‌లు మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధివద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముగ్గురు మంత్రులు వేర్వేరుగా పాత్రికేయులతో మాట్లాడుతూ పార్టీని సమర్థవంతంగా నడిపించే శక్తిసామర్థ్యాలు తనకున్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ చేసిన తొలి ప్రసంగమే రుజువు చేసిందన్నారు.
పార్టీలోని లక్షలాది మంది కార్యకర్తలు శశికళ ప్రధాన కార్యదర్శిగా పదవిని స్వీకరించడం పట్ల హర్షం ప్రకటించారని, అంతటితో ఆగకుండా ఆమె ముఖ్యమంత్రి పదవిని సైతం చేపట్టాలని కోరుకుంటున్నారన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ చేసిన ప్రసంగం పార్టీలో భవిష్యత్ మూడు తరాలవారిని కాపాడేవిధంగా ఉందని మంరో మంత్రి ఆర్పీ ఉదయ్ కుమార్ అన్నారు.
కార్యకర్తలను కాపాడే మహోన్నతమైన బాధ్యతలను స్వీకరించి అందరినీ ఆనందింపజేసిన శశికళ త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిగాను పదవీబాధ్యతలు చేపట్టడం ఖాయమేనన్నారు. జయలలితను ఆమె తల్లి కంటే ఎక్కువగా యేళ్ల తరబడి సంరక్షించింది చిన్నమ్మ మాత్రమేననీ, త్యాగశీలిగా పేరొందిన ఆమె ముఖ్యమంత్రిగాను తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోగలరన్నారు.
అలాగే, మంత్రి కడంబూరు రాజు మాట్లాడుతూ.... శశికళ ప్రసంగం అట్టడుగు కార్యకర్తలను సైతం బాగా ఆకట్టుకుందని, ప్రధాన కార్యదర్శిగానే కాకుండా ఆమెను ముఖ్యమంత్రిగాను చూడాలనుకోవడంలో తప్పు లేదన్నారు.