నేరుగా వస్తారా? తొలగించమంటారా? దినకరన్ వర్గానికి స్పీకర్ నోటీసులు

శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (16:09 IST)
తన ఎదుట నేరుగా హాజరవుతారా? లేదా? చర్యలు తీసుకోమంటారా? అంటూ అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలకు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 14న హాజరై వివరణ ఇవ్వాలన్నారు. ఈ నోటీసు‌తో వారు షాక్‌కు గురయ్యారు. 
 
ముఖ్యమంత్రి పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంను తన వర్గంలో చేర్చుకున్న తర్వాత దినకరన్ తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెల్సిందే. ఈయనకు 19 మంది ఎమ్మెల్యేలు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ 19 మందికే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అవసరమైతే వారి సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్‌ను ప్రభుత్వ విప్ కోరారు.
 
ఈనేపథ్యంలో తన ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందో వారు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ సరిగా లేకపోతే వారిపై స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అటు 19 మంది ఎమ్మెల్యేలు చేజారకుండా దినకరన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి