దేశంలో కరోనా వైరస్ మూడో దశ వ్యాప్తి ఓ సునామీలా విరుచుకుపడనుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా జోస్యం చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో అనేక రాష్ట్రాలు కరోనా లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్‌ను ఎత్తివేస్తున్నాయి.
అన్‌లాక్ కారణంగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని, దాంతో వైరస్ రూపాంతరం చెందుతూ ఉంటుందని ఆయన తెలిపారు. కొవిడ్ హాట్‌స్పాట్లలో తగిన నిఘా ఉంచడం అవసరమన్నారు. దేశంలో ఉన్న జనాభాకు టీకాలు అందించడం, కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్‌కు, డోస్‌కు మధ్య అంతరం తగ్గించడం సవాల్‌గా మారిందన్నారు.
కరోనా మొదటి, రెండో వేవ్‌ల నుంచి ఏం నేర్చుకున్నామో గుర్తు చేసుకోవాలన్నారు. కానీ, పలు రాష్ట్రాలు అన్‌లాక్ చేయడంతో జనం కనీస కొవిడ్ నిబంధనలు కూడా పాటించడం లేదని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగడం, థర్డ్ వేవ్ సునామీలా విరుచుకుపడటం ఖాయమని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు.