ఎయిర్‌ఫోర్స్ డే : గగనంలో రాఫెల్ యుద్ధ విమానాల విన్యాసాలు

గురువారం, 8 అక్టోబరు 2020 (11:51 IST)
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 88వ వార్షికోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఇటీవలే ఫ్రాన్స్ దిగుమతి చేసుకున్న ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు గగనంలో చిత్ర, విచిత్ర విన్యాసాలను చేసి చూపించాయి. ముఖ్యంగా, యుద్ధమంటూ వస్తే తాము ఏం చేయగలమో ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూపించాయి. ఈ విమానాలు గాల్లో చేసిన విన్యాసాలను చూసిన వీక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. 
 
ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (ఉత్తరప్రదేశ్ రాష్ట్రం) వేదికగా ఈ కార్యక్రమాలు సాగాయి. ఈ సందర్భంగా ప్రధాని వాయుసేనకు అభినందనలు తెలిపారు. "ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా, మన ధైర్యవంతులైన సైనికులకు అభినందనలు. మీరు కేవలం దేశపు గగనాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా, విపత్తుల సమయంలో అపరిమితమైన సేవ చేస్తున్నారు. మీ ధైర్యం, నిబద్ధత, దేశ రక్షణకు చూపుతున్న దీక్ష ప్రతి ఒక్కరికీ ఆదర్శం" అని ట్వీట్ చేశారు.
 
అలాగే, భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం అభినందనలు తెలిపారు. వాయుసేనను చూసి జాతి యావత్తూ గర్విస్తోందని అన్నారు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను పైలట్లు ఎదుర్కొంటూ, దేశానికి సేవలందిస్తున్నారని అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదూరియా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు