భారత వైమానిక దళ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా 35 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, తొలి విడతలో ఐదు విమానాలను భారత్ అత్యవసరంగా తెప్పించుకుంది. ఈ విమానాలు సోమవారం ఫ్రాన్స్‌లో బయలుదేరి... 7 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి... బుధవారం మధ్యాహ్నం భారత గడ్డపై ల్యాండ్ అయ్యాయి. బుధవారం ఉదయం భారత గగనతలంలోకి ప్రవేశించిన ఈ యుద్ధ విమానాలు.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హర్యానా రాష్ట్రంలోని అంబాలా వైమానికి స్థావరానికి చేరుకున్నాయి.
అంతకుముందు.. ఈ విమానాలు సోమవారం మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన 7 గంటల తర్వాత విమానాలు కొద్దిసేపు యూఏఈలోని అల్‌ధఫ్రా వైమానిక స్థావరంలో ఆగాయి. ఈ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత రెండు సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలు వీటిని తోడుకుని వస్తున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
కాగా, మంగళవారం 30 వేల అడుగుల ఎత్తులో ఓ ఫ్రాన్స్ ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకున్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా అంబాలా వైమానిక స్థావరం వద్ద భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్.భదూరియా కొత్త విమానాలను స్వీకరించారు.