అమృతపాల్‌ తక్షణం లొంగిపోవాలి - అకాల్ తక్త్ పిలుపు

ఆదివారం, 26 మార్చి 2023 (13:51 IST)
వారిస్ పంజాబ్ డే నాయుకుడు అమృతపాల్ సింగ్ బాహ్య ప్రపంచంలో ఉంటే తక్షణం పోలీసులకు లొంగిపోవాలని సిక్కుల పరమ పవిత్రమైన అకాల్ తక్త్ కోరింది. ఈ మేరకు అకాల్ తక్త్ జత్యేదార్ జ్ఞాని హర్‌ప్రీత్ సింగ్ శనివారం పిలుపునిచ్చారు. అదేసమయంలో ఆయన పంజాబ్ పోలీసుల సామర్థ్యాన్ని కూడా ప్రశ్నించారు. అంతపెద్ద దళాన్ని పెట్టుకొని అసలు ఇప్పటివరకు అమృత్‌పాల్‌ను అరెస్టు చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, 'అమృత్‌పాల్‌ బయటే ఉంటే.. పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాలని కోరేవాడిని' అని హర్‌ప్రీత్ అభిప్రాయపడ్డారు.
 
ఈ మేరకు శనివారం జత్యేదార్‌ జ్ఞాని ఓ వీడియో సందేశం విడుదల చేశారు. పంజాబ్‌లో అంతమంది పోలీసులున్నా.. అమృత్‌పాల్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారన్నదే ప్రపంచ వ్యాప్తంగా సిక్కుల మెదళ్లను తొలిచివేస్తున్న ప్రశ్నగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన పోలీసుల పనితీరుపై సందేహాలను రేకెత్తిస్తోందన్నారు. ఈ పరిస్థితిపై చర్చించేందుకు దాదాపు 70 సిక్కు సంస్థలతో సమావేశం కావాలని హర్‌ప్రీత్‌ నిర్ణయించారు. 
 
ఒక వేళ అతడిని ఇప్పటికే అరెస్టు చేస్తే పోలీసులు ఆ విషయాన్ని ప్రకటించాలన్నారు. ఇప్పటికే అమృత్‌పాల్‌ తల్లిదండ్రులు మాత్రం పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అమృత్‌పాల్‌ సింగ్‌ పరారీకి సంబంధించి శనివారం మరో ఫొటో వెలుగులోకి వచ్చింది. ప్యాంటు, కోటు ధరించి ఫోన్లో మాట్లాడుతూ పటియాలా ప్రాంతంలో వెళ్తున్నట్లుగా ఆయన చిత్రాలు కెమెరాలో రికార్డయ్యాయి. 
 
మరో ఫుటేజీలో కళ్లజోడు ధరించి రోడ్డుపై నడుచుకుంటూ ఫోనులో మాట్లాడుతూ వెళ్తున్నట్లు ఉంది. అమృత్‌పాల్‌ సహాయకుడి నుంచి శుక్రవారం స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో పలు చిత్రాలున్నాయని పోలీసులు వెల్లడించారు. ఖలిస్థానీ జెండా, ముద్ర, కరెన్సీ, ఆయుధ శిక్షణ పొందుతున్న వీడియోలు అందులో ఉన్నాయని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు