కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్డౌన్ అమలు చేసింది. ఆ సమయంలో అనేక మంది లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. ఇలాంటి వారిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేశాయి. అలా కేసులు నమోదు చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. ఇపుడు ఈ తరహా కేసులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వం ఎత్తివేసింది. అలాగే, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో నమోదైన కేసులను కూడా రద్దు చేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఎడప్పాడి మాట్లాడుతూ, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్నీ ఇపుడు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొట్లాడి కేసులలో ఇరుక్కున్న వారందరిపై నమోదైన కేసులన్నీ కూడా ఎత్తివేయనుంది.
అయితే, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, పోలీసులు విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం, హింసకు పాల్పడటం లాంటి నేరాలు మినహా ఇతర కేసులలో ఇరుక్కున్న అందరిపై ఆయా కేసులను ఎత్తివేయనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పొడి పళనిస్వామి ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం 1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణలు చేస్తూ 2019లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు సైతం ఆ చట్టానికి ఆమోదం తెలిపాయి. అయితే ఆ వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా దేశమంతా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమిళనాడులోనూ ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలకు సంబంధించి ఆ రాష్ట్రంలో మొత్తం 1500 కేసులు నమోదయ్యాయి. అందులో క్రిమినల్ కేసులు మినహా మిగతా అన్నింటిని ఎత్తివేస్తున్నట్లు పళనిస్వామి ప్రకటించారు.