తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకుని, వారి నుంచి ముప్పు ఉందని భావించి భద్రత కల్పించాలని కోరడం సబబు కాదని, ప్రేమజంట స్వేచ్ఛకు ప్రమాదం ఉందని చెప్పేందుకు ఒక్కటంటే ఒక్క కారణం కూడా చెప్పలేకపోతున్నారని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పైగా, తల్లిదండ్రుల నుంచి పెళ్లి చేసుకున్న ప్రేమజంట జీవితానికి, స్వేచ్ఛకు నిజంగానే ముప్పు ఉంటే తప్ప వారికి భద్రత కల్పించేలేమని తేల్చి చెప్పింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయ కేసర్వానీ తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో పెద్ద నుంచి తమకు ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించడంతో పాటు తమ వైవాహిక జీవితంలో ఇతరుల జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని భర్తతో కలిసి హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు పైవిధంగా వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ప్రమాదం ఉందని చెప్పేందుకు ఒక్క కారణం కూడా లేదని, కాబట్టి రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వారికి నిజంగానే ముప్పు ఉందని భావిస్తే తామే రక్షణ కల్పిస్తామని స్పష్టం చేసింది. సమాజాన్ని ఎదుర్కోవడం కోసం దంపతులిద్దరూ ఒకరికొకరు అండగా నిలబడాలని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.