మరో టీసీఎస్‌ని మైక్రోసాఫ్ట్ ఎందుకు రూపొందించలేదు: టాటా సన్స్ చైర్మన్ సవాల్

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (03:48 IST)
మైక్రోసాఫ్ట్ ఉత్పత్తి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ లాంటిదాన్ని భారతీయులు ఎందుకు రూపొందించలేకపోయారని అడగటం కాదు.. మరో టీసీఎస్‌ని నీవెందుకు సృష్టించలేకపోయావని మనమే మైక్రోసాఫ్ట్‌ని ప్రశ్నించాలని భారతీయ పారిశ్రామిక దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కొత్త చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సవాల్ విసిరారు. 
అదేవిధంగా అమెరికా ఐటీ పరిశ్రమలో డొనాల్డ్ ట్రంప్ చర్యల ద్వారా వస్తున్న అనిశ్చితి గురించి భయాందోళనలు చెందడం అసంగతం, చెత్త అని కొట్టిపడేశారు. 
 
టీసీఎస్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీగా మారడానికి బదులు వ్యయాన్ని తగ్గించుకోవడంపైనే ఎందుకు దృష్టి సారిస్తోంది అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన సందర్భంగా టీసీఎస్ చైర్మన్ ట్రంప్ చర్యలతో భారతీయ ఐటీ సర్వీసులు వణికిపోవాల్సిన పనిలేదన్నారు. అమెరికా ఉపాధి కల్పనను తగ్గించుకుంటే మనం సెలబ్రేట్ చేసుకోవాలే తప్ప దాన్ని కార్మికుల బేరసారాలుగా వ్యాఖ్యానించాల్సిన పనిలేదన్నారు. 
 
ప్రభుత్వాల నుంచి క్రమబద్ధీకరణ సమస్య వచ్చిన ప్రతిసారీ పరిశ్రమ మునిగిపోతోందని వార్తలు వస్తూనే ఉంటాయని, అమెరికా హెచ్1బి వీసాలను తగ్గిస్తుందని, వీసా ఫీజులు పెంచుతుందని వార్త వస్తే చాలు మన ఐటీ పరిశ్రమ చిక్కుల్లో పడుతోందని అందరూ మాట్లాడుతుంటారని చంద్రశేఖరన్ ఎద్దేవా చేసారు.  కానీ దాన్ని కొత్త అవకాశాల అన్వేషణకు సవాలుగా ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. అమెరికా ఒక చర్య తీసుకుంటే ఇక్కడ మనం ఆందోళన చెందడానికి ఇది 1980 కాదని, 2017 అని పేర్కొన్నారు. మనం విండోస్‌ని ఎందుకు రూపొందించలేకపోయామని కాదు. మైక్రోసాఫ్ట్ మరొక టీసీఎస్‌ని ఎందుకు నిర్మించలేకపోయందని మనం ప్రశ్నించగలగాలని, అప్పుడే మన సత్తా తెలుస్తుందని అన్నారు. 
 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో అది పెద్ద అవకాశాలను కల్పించబోతోందని, పరిశ్రమకు ఎప్పుడూ ఒడిదుడుకులు ఉండవని అవకాశాలే ఉంటాయని వాస్తవానికి ఇది ఐటీరంగానికి అద్భుతమైన సమయమని, ప్రతి రంగమూ ఇప్పుడు మళ్లీ కొత్త రూపు దాలుస్తోందని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే పరిశ్రమలను పునర్నిర్వచిస్తోందని, ఐటీ రంగానికి డిమాండ్ అసాధారణంగా ఉందని చంద్రశేఖరన్ చెప్పారు. పరిశ్రమ కూడా క్రికెట్ పిచ్ లాంటిదేనని, సాధారణ బంతి కూడా అద్భుతం సృష్టించవచ్చన్నారు.
 

వెబ్దునియా పై చదవండి