మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టమట. అంతేకాదు.. నెల్లూరు నుంచి బీజేపీ సీనియర్ నేత, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీసుకెళ్లే రొయ్యలంటే లొట్టలేసుకుని తింటారట. ఇంకా స్వీట్లు అంటే ఇష్టంగా తినేవారని సన్నిహితులు చెప్తున్నారు. ఆయన పరిపాలనా దక్షుడే కాదు.. మంచి భోజనప్రియుడని సన్నిహితులు అంటున్నారు.
ప్రధానిగా ఉన్న సమయంలో అధికారిక కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా ఫుడ్ కౌంటర్ దగ్గరకు వెళ్లి స్వయంగా ఆర్డర్ ఇచ్చుకునేవారు. ఎక్కడికైనా వెళ్తే ఆ ప్రాంతంలో ఫేమస్ అయిన వంటకాలను రుచి చూసేవారట. కోల్‌కతాలో పుచ్ కాస్, హైదరాబాద్ బిర్యానీ, హలీమ్, లక్నో గలోటి కబాబ్స్ అంటే ఇష్టపడి మరీ తింటారట.
అంతేగాకుండా ఛాట్ మసాలా దట్టించిన పకోడాలు, మసాలా టీ కాంబినేషన్ అంటే భలే ఇష్టపడేవారు. లక్నో నుంచి స్నేహితులు వస్తే కబాబ్స్ అది పనిగా తెప్పించుకునేవారట. నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వయంగా వాజ్ పేయి అమితంగా ఇష్టపడే రొయ్యలను నెల్లూరు నుంచి తీసుకువచ్చేవారు. కనీసం వారంలో రెండు రోజులైనా ఆయన మెనూలో రొయ్యలు ఉండేవట.