నందిగ్రామ్‌లో ఓడిన మమతా బెనర్జీ.. గెలిచిన సువేంధుపై దాడి?

సోమవారం, 3 మే 2021 (08:47 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోయారు. ఎన్నికల ముందు వరకు తనకు కుడిభుజంగా ఉండి, ఇపుడు బీజేపీలో చేరి తన ప్రత్యర్థిగా బరిలోకిదిగిన సువేంధు అధికారి చేతిలో ఆమె స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో సువేంధుపై హల్దియా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అందుబాటులోని సమాచారం ప్రకారం, ఓ కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన బయటకు వచ్చి వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. 
 
ఇదేసమయంలో ఆరామ్ బాగ్ ప్రాంతంలో బీజేపీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన బీజేపీ, నేతలు, ఈ పనులకు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని ఆరోపించారు.
 
ఈ ఆరోపణలను ఖండించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ కార్యకర్తలే తమ పార్టీ ఆరామ్ బాగ్ అభ్యర్థి సుజాతా మోండాల్‌ను వెంబడించారని, తలపై కొట్టారని ఆరోపించారు.
 
కాగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన సువేందు అధికారి, ఆపై బీజేపీలో చేరి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ పడిన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి స్వయంగా మమతా బెనర్జీ బరిలోకి దిగడంతో, ఈ పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. 
 
ఫలితాలు వెల్లడైన తర్వాత మాట్లాడిన సువేందు, తాను నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, వారి సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలు, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు