బెంగాల్‌లో టీఎంసీకి సంపూర్ణ విజయం : మమతకు షాకిచ్చిన నందిగ్రామ్

ఆదివారం, 2 మే 2021 (20:40 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ 210 చోట్ల విజయం సాధించనుంది. అయితే, సర్వత్రా ఉత్కంఠ కలిగించిన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో మాత్రం టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 
 
ఈ స్థానంలో పోటీ చేసిన టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 1,736 ఓట్ల మెజారిటీతో సీఎం మమతా బెనర్జీపై విజయం సాధించారు. 
 
ఓవైపు రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అద్భుత విజయాలు అందుకున్న తరుణంలో, పార్టీ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమిపాలవడం పార్టీ వర్గాలకు మింగుడుపడని విషయమే.
 
మరోవైపు, బెంగాల్‌లో 292 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. రాత్రి 8.30 గంటలకు అధికార టీఎంసీ 192 స్థానాల్లో నెగ్గింది. మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 147 కాగా, ఆ మార్కును టీఎంసీ ఎప్పుడో దాటేసింది.
 
ఇక, ఈ ఎన్నికల ద్వారా బెంగాల్ అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని కలలు గన్న బీజేపీకి ఆశాభంగం తప్పలేదు. బీజేపీ 61 స్థానాల్లో నెగ్గి, మరో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
 
ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించామన్న తృప్తి టీఎంసీ శ్రేణులకు దక్కలేదు. అందుకు కారణంగా నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ ఓటమి. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో మమతా స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. 
 
ఈ ఫలితంపై పెద్దగా బాధపడాల్సిన పనిలేదని మమతా పార్టీ నేతలను ఊరడించారు. అయితే, ఓట్ల లెక్కింపులో తేడా జరిగిందని, తాము దీనిపై కోర్టుకు వెళతామని ఆమె వెల్లడించారు.
 
కాగా, నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు అనంతరం సువేందు అధికారి 1,736 ఓట్ల తేడాతో నెగ్గినట్టు ప్రకటించారు. అయితే, దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ... నందిగ్రామ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, ఊహాగానాలు ప్రచారం చేయొద్దని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు