దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరు నగరంలో డిసెంబర్ 31వ తేదీన కొందరు యువతుల పట్ల పలువురు మగాళ్లు ప్రదర్శించిన అనుచిత వైఖరిపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఇది ప్రతి ఒక్క భారతీయుడు సిగ్గుపడాల్సిన విషయం అంటూ సోషల్‌మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తంచేశారు.
'బెంగళూరులో యువత చేసిన వికృత చేష్టలు సిగ్గుపడాల్సిన విషయం. మేమూ ఆ వయసు దాటి వచ్చినవారిమే కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంపై వెంటనే స్పందించాలి' అని ప్రముఖ స్క్రిప్ట్ రైటర్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ట్వీట్ చేశారు.
'బెంగళూరులో చోటుచేసుకున్న ఘటన చాలా బాధాకరం. మన దేశంలో ఇలాంటివి జరిగాయంటే అది మనందరికీ అవమానకరం. ఇలాంటి విషయాల్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ కాలపు యువత.. ఆడపిల్లలపై ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే ఏమీ జరగదులే అనుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలా తప్పు జరిగిన వెంటనే అరెస్ట్ చేస్తుంటే పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. ఆడపిల్లలవైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారు' అని బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు.