అమ్మ సెంటిమెంట్.. తీవ్ర ఉత్కంఠ.. బల పరీక్షలో నెగ్గేదెవరు? సీఎం పీఠం ఎవరిని వరిస్తుంది? పన్నీరునా? చిన్నమ్మనా? అని ప్రజలు ఆత్రుతతో వేచి చూస్తున్నారు. సీఎం పీఠం కోసం అటు శశికళ, పన్నీర్ సెల్వం టెన్షన్‌తో ముందుకెళుతుండగా.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మాత్రం రాత్రికి రాత్రే నిద్రపట్టని పరిస్థితి వచ్చిపడింది.
పన్నీర్ సెల్వం ద్రోహి అని ప్రకటించడమే కాకుండా పార్టీ ఎమ్మెల్యేలంతా తనతోనే ఉన్నారని ప్రకటించిన అనంతరం బల నిరూపణ పరీక్ష నేపథ్యంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలనందరినీ శశికళ ప్రత్యేక బస్సుల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. రాత్రంతా ఆయా లగ్జరీ హోటల్స్‌లలో బస ఏర్పాటుచేసి సకల విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. అయితే మీడియా ఓ గ్రూపును కనిపెట్టేసింది. చెన్నైకు 80 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురానికి తీసుకెళ్లారు. అక్కడ వారిని గోల్డెన్ బే రిసార్ట్‌కు తీసుకెళ్లి బీచ్, మసాజులు, వాటర్ స్కైయింగ్ ఇలా ఎన్నో అబ్బురపడే ఏర్పాట్లు చేశారు.
ఇంకా వారి ఫోన్లను పక్కనబెట్టేసి.. వారికి మజా చేసేలా ఏర్పాట్లు చేశారు చిన్నమ్మ. అయితే, ఈ బృందంలోని ఎస్పీ షణ్ముగనాథన్ అనే వ్యక్తి మాత్రం బాత్ రూం బ్రేక్ అని చెప్పి వెళ్లి ఇక తిరిగి రాలేదంట. అతడు సెల్వం వెంట వెళ్లి ఉంటాడని టాక్. అలాగే, ఈ గోల్డెన్ బే రిసార్ట్ వద్ద దాదాపు సీఎం క్యాంపు ముందే ఉండే స్థాయి భద్రత ఏర్పాటు చేశారు.
గురువారం బలనిరూపణకు సెల్వం, శశికళ తమ మద్దతుదారులతో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలవనున్నారు. ఈ నేపథ్యంలో చిన్నమ్మ వైపు బలం తగ్గిపోతుందని.. పన్నీర్ వెంట బలం పెరిగిపోతోందని.. మెల్ల మెల్లగా ఎమ్మెల్యేలు ఓపీవైపు మొగ్గుచూపుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు.