తెలుగు చిత్రపరిశ్రమపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై యేడాది గడిచినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం మర్యాదనిమిత్తం అయినా కలవకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏపీ ముఖ్యమంత్రి పట్ల కనీస మర్యాద లేదా అని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తెలుగు చిత్రపరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ నిర్మాత బన్నీ వాసు ఎక్స్ వేదికగా స్పందించారు. చిత్రపరిశ్రమలో అతంర్గత రాజకీయాలు, ఐక్యతా లోపంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్‌గా ఉంటాయి. అలాగే చాలా లోతుగా కూడా ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే, మన యానిటీ ఎలా ఉంది అనే ప్రశ్నించుకునే సమయం వచ్చింది అంటూ బన్నీ వాసు తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బన్నీ వాసు చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.