ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ఠాగూర్

ఆదివారం, 25 మే 2025 (19:00 IST)
టాలీవుడ్ పెద్దలపై సినీ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కన్నెర్రజేశారు. చిత్రపరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్టును తాను స్వీకరిస్తున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన చాలా ఘాటుగా ఉంది. తెలుగు చిత్రపరిశ్రమలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పను సంచలనం సృష్టిస్తోంది. 
 
ఈ ప్రకటన తర్వాత తెలుగు చిత్రసీమలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బడా సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆదివారం మీడియా ముందుకు వచ్చారు. థియేటర్లను, ఫిల్మ్ ఇండస్ట్రీని తమ గుప్పెట్లో పెట్టుకున్న ఆ నలుగురులో తాను లేనని, ఆ గ్రూపు నుంచి తాను ఎపుడో బయటకు వచ్చేసినట్టు తెలిపారు. 
 
పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం పెద్ద దుస్సాహసమే అని అన్నారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లిన పవన్.. చిత్రపరిశ్రమకు సాయం చేస్తున్నారన్నారు. కానీ, సినీ పరిశ్రమకు చెందిన ఏ సంస్థకు చెందిన వాళ్లు కూడా ఏ ప్రభుత్వ పెద్దలను కలవలేదన్నారు. 
 
ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు అంటున్నారన్నారు. అలాంటపుడు గత ప్రభుత్వ పెద్దలను ఎందుకు కలిశారని అల్లు అరవింద్ నిలదీశారు. మనకు కష్టం వచ్చిందనే కదా అప్పటి ముఖ్యమంత్రిని కలిశారు.. మరి ఇవాళ సినీ పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటపుడు అందరూ కూర్చొని ఏం చేయలేరనేది చర్చించాలి కదా. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మధ్య సమస్యలుంటే చర్చించుకోవాలి అని హితవు పలికారు. 
 
తాను 50 యేళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్నానని, తనకు తెలంగాణాలో ఒక్క థియేటర్ మాత్రమే ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 లోపు థియేటర్లు ఉన్నాయన్నారు. వాటిని కూడా ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ వస్తున్నట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు