బెంగుళూరులో విదేశీయుల ఇళ్ళలో సీసీబీ మెరుపు సోదాలు

శుక్రవారం, 16 జులై 2021 (13:41 IST)
దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరులో విదేశీయులు నివసించే గృహాల్లో సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మెరుపు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 38 మంది వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా నగరంలోనే తిష్టవేసినట్లు గుర్తించారు. 
 
ఈ సోదాలపై సీసీబీ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ మీడియాతో మాట్లాడుతూ ఈస్ట్‌ విభాగంలో ఆరుగురు ఏసీపీలు, 20 మంది ఇన్‌స్పెక్టర్లు, 100 మందికి పైగా పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారని చెప్పారు. 
 
ముఖ్యంగా, ఆఫ్రికా దేశాలకు చెందిన వారు మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు. కాగా దాడుల సందర్భంగా కొందరి నివాసాల్లో గంజాయి తదితర మాదకద్రవ్యాలు లభించాయని వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టాల క్రింద కేసులను నమోదు చేసినట్టు తెలిపారు.
 
మరోవైపు, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉంటున్న వారి వివరాలను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళతామన్నారు. ఒక వేళ కేంద్రం సిఫార్సు చేస్తే వీసా అవధిని పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. 
 
వీసా గడువు ముగిసిన వెంటనే విదేశీయులు నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో తెలియజేయాల్సి ఉంటుందని, అయితేఈ నియమాన్ని పాటించడం లేదన్నారు. నగర వ్యాప్తంగా అన్ని విభాగాల్లోనూ విదేశీయుల నివాసాలపై కన్నేసి ఉంచామని ఆయన చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు