డెల్టా వేరియంట్: ఈ ఆసియా దేశాలు ఎందుకింతగా భయపడుతున్నాయి
మంగళవారం, 6 జులై 2021 (09:46 IST)
భారతదేశంలో కరోనావైరస్ ఉద్ధృతి తగ్గినప్పటికీ ఆసియాలోని మరికొన్ని దేశాలలో మాత్రం ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. ఒక వైపు డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసియాలోని చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. ఇప్పటి వరకు గుర్తించిన వేరియంట్లన్నిటి కంటే డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
భారతదేశానికి పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకలో మే నెలలో ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా నేపాల్‌లో కోవిడ్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం వల్ల ఆ దేశ వైద్య వ్యవస్థపై విపరీతమైన భారం పడి తీవ్ర ప్రభావాన్ని చూపించింది. జూన్‌లో అఫ్గానిస్తాన్ లో అత్యధిక స్థాయిలో కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాజిద్ మజ్రూహ్ చెప్పారు. అందులో డెల్టా వేరియంట్ కారణంగా 60 శాతం కేసులు దేశ రాజధాని కాబూల్‌లోనే నమోదైనట్లు చెప్పారు. బంగ్లాదేశ్, ఇండోనేసియా, థాయిలాండ్, మంగోలియాలలో కూడా కేసులు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ దేశాల్లో ఏం జరుగుతుందో బీబీసీ మరింత నిశితంగా పరిశీలించింది.
బంగ్లాదేశ్
భారత్‌తో సుదీర్ఘ సరిహద్దులు కలిగిన బంగ్లాదేశ్‌లో మే నెల రెండో వారం నుంచి కేసుల పెరుగుదల కనిపిస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నమోదైన కేసుల్లో 68 శాతం డెల్టా వేరియంట్ కేసులని మే 25 నుంచి జూన్ 7 వరకు నమోదైన సమాచారాన్ని పరిశీలించిన ఒక ప్రభుత్వ అధ్యయనం తెలిపింది. ఈ వేరియంట్ వల్ల కలిగే ప్రభావంతో ఆందోళన చెందిన బంగ్లాదేశ్ ప్రస్తుతం దేశవ్యాప్త లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ విధించడానికి ముందు ఢాకాలో ఉన్న వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడం కేసుల సంఖ్య మరింత పెరగడానికి కారణమని చెబుతున్నారు.
మిగిలిన దేశాల కంటే, ముందుగానే ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికీ నెమ్మదిగా సాగింది. ఏప్రిల్‌లో ఇక్కడ వ్యాక్సినేషన్ల ప్రక్రియను రద్దు చేశారు. బంగ్లాదేశ్ ఇప్పటి వరకు 16 లక్షల ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ డోసులను ప్రజలకు ఇచ్చింది. ఈ వ్యాక్సిన్లను బంగ్లాదేశ్‌కు భారత్ సరఫరా చేసింది. ఏప్రిల్ నుంచి భారత్ బంగ్లాదేశ్‌కు వ్యాక్సీన్ సరఫరా నిలిపివేసింది. సైనోఫార్మ్ వ్యాక్సిన్లను చైనా విరాళంగా ఇవ్వడంతో, బంగ్లాదేశ్ జూన్ 22 నుంచి తిరిగి వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ఈ దేశంలో జూన్ 30 నాటికి 3 శాతం కంటే తక్కువ మంది జనాభా వ్యాక్సీన్ తీసుకున్నారు.
ఇండోనేసియా
ఇండోనేసియా కూడా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జులై 20 వరకు లాక్ డౌన్ విధించింది. ఇక్కడ జూన్ మొదటి వారం నుంచీ కేసులు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికి డెల్టా వేరియంటే కారణమని ప్రభుత్వం చెబుతోంది. గత మూడు వారాల్లో నమోదైన కేసుల్లో 60 శాతం డెల్టా వేరియంట్ వల్ల వచ్చినవేనని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండోనేసియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. కానీ, ఇప్పటి వరకు 5 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది.
రోజుకు 10 లక్షల వ్యాక్సీన్ల చొప్పున వేస్తూ, ఆగస్టు నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత పెరుగుతోందని.. ఇండోనేసియా కోవిడ్ సంక్షోభం దాదాపు విపత్తు ధశకు చేరుకుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ పేర్కొన్నాయి.
థాయిలాండ్
థాయిలాండ్‌లో ఇటీవల కాలంలో పెరిగిన కేసులకు, మరణాలకు డెల్టా వేరియంటే కొంతవరకు కారణమని ఆ దేశ మెడికల్ సైన్సెస్ విభాగం ప్రకటించింది. ఈ వారం మొదట్లో, బ్యాంకాక్‌లో నమోదైన మొత్తం 26 శాతం కేసుల్లో డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపింది. ఫుకెట్‌లో పర్యటకానికి ఊతమిచ్చేందుకు విదేశీ యాత్రికులను అనుమతించిన తరువాత డెల్టా వేరియంట్‌ను ఇక్కడ గుర్తించారు. జూన్ చివరి నాటికి థాయిలాండ్‌లో సుమారు 4 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయింది. "వైరస్ వల్ల ముప్పు ఉందని తెలుసు కానీ, థాయ్ ప్రజలు జీవనం సాగించాలంటే దానిని ఆమోదించాల్సిన అవసరముంది" అని థాయ్ ప్రధాన మంత్రి ప్రయుత్ చాన్ ఓచా మీడియాకు చెప్పారు.
మంగోలియా
మంగోలియాలో 50 శాతానికి పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయింది. అందులో చాలావరకు చైనా సైనోఫార్మ్ వ్యాక్సీన్‌ను ఇచ్చారు. జనాభాపరంగా చూసుకుంటే, ఇటీవల కాలంలో కేసులు, మరణాల సంఖ్య ఆసియాలోనే అత్యధికంగా ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంది మంగోలియా. చైనా వ్యాక్సీన్లపై అధికంగా ఆధారపడిన దేశాలకు, కేసుల సంఖ్య పెరగడానికి సంబంధం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
కానీ, దేశంలో లాక్‌డౌన్ సడలించడం వల్లే జూన్ నెలలో కేసులు పెరిగాయని మంగోలియాలో ఒక అధికారి తెలిపారు. చైనా వ్యాక్సీన్లు ప్రభావవంతంగా లేకపోవడం కేసుల పెరుగుదలకు కారణం కాదని అన్నారు. ఇండోనేసియాలో ఇచ్చిన 85 శాతం వ్యాక్సీన్లు చైనా తయారీవే. అయితే, సీనోవాక్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత డజను మందికి పైగా వైద్య రంగ సిబ్బంది మరణించినట్లు నివేదికలు వచ్చాయి. డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సీన్ సమర్థంగా పని చేస్తుందో లేదో పరిశీలించేందుకు ఆ దేశంలో ఎపిడెమియాలజిస్టులు పరిశోధనలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఇండోనేసియాలో మూడో బూస్టర్ షాట్ కూడా అవసరమా అనే చర్చ జరుగుతోంది. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడో డోసు తీసుకోవాలని ఇంకా సూచించలేదు. సీనోవాక్, సైనోఫార్మ్ వ్యాక్సీన్లు వాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఆమోదాన్ని ఇచ్చింది.