సాధారణంగా భర్త మద్యం సేవించి ఇంటికి వస్తే భార్యకు కోపం వస్తుంది. కానీ, ఇక్కడ భార్య మద్యం సేవించడం లేదంటూ భర్తకు కోపం వచ్చింది. ఆ వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, భోపాల్ నగరానికి చెందిన ఓ మధ్యతరగతి వ్యక్తికి పదేళ్లక్రితం అదే నగరానికి చెందిన ఓ మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. తమ కుటుంబ విందులు, వినోదాల సందర్భంగా తన భార్య మద్యం తాగడం లేదని సాక్షాత్తూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
తన తల్లితోపాటు అందరూ పార్టీల్లో మద్యం తాగుతున్నారని, కాని తన భార్య మాత్రం మద్యం తాగడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా, కుటుంబ విందుల్లో తన భార్య కంపెనీ ఇవ్వక పోవడం వల్ల తరచూ తన భార్యతో గొడవలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఈ ఫిర్యాదు చూసిన ఫ్యామిలీ కోర్టు కౌన్సెలర్లు నిర్ఘాంత పోయారు.
అయితే, భార్య మాత్రం తనకు మద్యం సేవించడం ఏమాత్రం ఇష్టం లేదనీ వాదిస్తోంది. కానీ, తన కోసమైనా పార్టీలు జరిగే సమయాల్లో మాత్రం ఖచ్చితంగా మద్యం సేవించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు భార్యాభర్తల మధ్య రాజీ కుదర్చాల్సిందిగా ఇరు వర్గాల న్యాయవాదులను ఆదేశించింది.