దరిద్రుడు వర్షమొస్తోందని తాటిచెట్టు కింద చేరితే వడగళ్లవాన కురింసిందట. అలానే ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఉత్తరప్రదశ్‌లో బీజేపీ చేతిలో, ప్రధానంగా మోదీ చేతిలో ఊచకోతకు గురైనా, పంజాబ్‌లో అద్భుత విజయంతో ఊపిరి పీల్చుతున్న కాంగ్రెస్ గోవా, మణిపూర్ వంటి చిన్న రాష్ట్రాల్లో పోటీపడి సమతూకం సాధించినా ఫలితం బీజేపీ తన్నుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి తొలి దెబ్బ గోవాలో పడింది.
బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. త్రిశంకు సభ ఏర్పడిన గోవాలో ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీలకు చెందిన ముగ్గురేసి ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించడంతో బీజేపీ బలం 22కి చేరింది. మేజిక్ ఫిగర్ కంటే ఒక సీటు ఎక్కువే ఉన్నదన్న మాట.