భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలలోనే దళిత వ్యతిరేక ముద్ర ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దళితులను అణగదొక్కేయడమనేది ఆరెస్సెస్, బీజేపీ 'డీఎన్‌ఏ'లోనే ఉంది. ఎవరైనా ఎదిరిస్తే వాళ్లని హింసించి నలిపేస్తారు. మోడీ ప్రభుత్వం నుంచి తమ హక్కులను కాపాడమంటూ మన దళిత సోదరులు, సోదరీమణులు ఈ రోజు రోడ్డెక్కారు. వారికి మేం సెల్యూట్ చేస్తున్నాం అని చెప్పారు.
కాగా, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ దళిత సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో 3 రాష్ట్రాల్లో 9 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ఆరుగురు మరణించారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్థాన్, యూపీలోని ముజఫర్‌నగర్, మీరట్‌లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని పోలీసులు తెలిపారు.