అంధ శాస్త్రవేత్త తన పెద్ద మనసును చాటుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కోసం ఏకంగా రూ.110 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఈ అంధ శాస్త్రవేత్త దాత పేరు ముర్తజా. రాజస్థాన్ రాష్ట్రంలో పుట్టి.. ముంబైలో స్థిరపడ్డారు. కోటలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ముర్తాజా తర్వాత శాస్త్రవేత్త ఎదిగారు. జీపీఎస్, కెమెరా వంటివి లేకుండానే వాహనాలను ట్రాక్ చేసే 'ఫ్యూయల్ బర్న్ రేడియేషన్ టెక్నాలజీని' ఆయన తయారు చేశారు.
ఈయన పుట్టుకతో అంధుడు. తోటివారి కష్టాలను కళ్లతో చూడలేని దీనుడు. కానీ, తన మంచి మనసుతో వారు పడుతున్న బాధను, కష్టాలను అంచనావేయగలడు. అందుకే ఎదుటివారి బాధలను మనస్సుతోనే అర్థం చేసుకుని తన పెద్ద మనసును మరోమారు చాటిచెప్పాడు.
ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాంన్ల కుటుంబాలను ఆదుకోవడం కోసం ఒకటి, రెండూ కాదు, ఏకంగా 110 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. ఈ మొత్తాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి జమ చేయనున్నాడు.
అంత పెద్ద మొత్తంలో విరాళమివ్వడానికి కారణమేంటని ప్రధాని కార్యాలయ అధికారులు ప్రశ్నించారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానంతో వారంతా అవాక్కయ్యారు. "మాతృభూమి కోసం ప్రాణాలొదిలిన జవాన్ల ఒంట్లో ప్రవహిస్తున్న రక్తమే దేశ పౌరులందరిలోనూ ప్రవహిస్తోందని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని" ఆయన సమాధానమిచ్చారు.