తమిళనాడు రాజధాని చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్యకు గురైన టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడైన రామ్ కుమార్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరెంటు తీగను నోటితో కొరకడంతో రామ్ కుమార్ షాక్ తిని ప్రాణాలు కోల్పోయాడు. పుళల్ జైలులో ఉన్న రామ్ కుమార్‌ను పోలీసులు వేధింపులకు గురిచేయడంతో ఆతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇంతకుముందు రామ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన తరుణంలోనూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో హత్యకు గురైన స్వాతి హత్యకేసులో నిందితుడి గుర్తింపులో తీవ్ర కష్టాలు పడ్డ చెన్నై పోలీసులు చివరకు తిరునల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోని మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్ హంతకుడిగా గుర్తించారు.
తాము పట్టుకునే క్రమంలో నిందితుడు గొంతు కోసుకున్నట్టుగా పోలీసులు వాదించడమే కాదు, కేసూ పెట్టారు. నిందితుడు రామ్‌కుమార్ అన్నది తేలినా, సాక్ష్యాల సేకరణకు మరింత కుస్తీలు పడ్డారు. ఈ సమయంలో రామ్‌కుమార్ నిందితుడు కాదు అని, అమాయకుడని, ఎవర్నో రక్షించే యత్నంలో రామ్‌కుమార్‌ను బలిపశువు చేశారన్న ఆరోపణలు బయలు దేరాయి. ఈ నేపథ్యంలో రామ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం తమిళనాట చర్చనీయాంశమైంది.