15 రోజుల్లోపు విభజన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తే ఆందోళనను విరమిస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. ఐదో రోజు గురువారం పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన కొనసాగుతున్న వేళ.. ఏపీకి న్యాయం జరిగేంతవరకు తమ ఆందోళనను విరమించేది లేదని సుజనా చౌదరి అన్నారు.
ఇక ఉభయ సభల్లో ఏపీ ఎంపీల నిరసనలు ఏమాత్రం వీడట్లేదు. లోక్ సభలో తెలుగుదేశం ఎంపీలు చేస్తున్న నిరసన శ్రుతి మించింది. దీనిపై స్పీకర్ సుమిత్రా సీరియస్ అయ్యారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్, వెల్ లోకి దూసుకెళ్లి హంగామా చేశారు. లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎదుట ఉన్న పుస్తకాలను శివప్రసాద్ లాగి పారేసే ప్రయత్నం చేశారు.
వెంటనే బీజేపీ ఎంపీలు, అధికారులు, ఇతర సిబ్బంది శివప్రసాద్‌ను అడ్డుకున్నారు. అలాగే గురువారం లోక్‌సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. గోవిందా గోవిందా అంటూ టీడీపీ నినాదాలు చేశారు. ఎంపీ శివప్రసాద్ ఏకంగా పూనకం వచ్చినట్టుగా ఊగిపోయారు.
మరోవైపు సభలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ సభాపక్ష ఉపనేత జ్యోతిరాదిత్యతో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, రామ్మోహన్‌నాయుడు మంతనాలు జరిపారు. ఏపీలో పరిస్థితిని సోనియాకు ఎంపీలు వివరించారు. తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారిని కోరారు.