పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లుచేశారు. ఉదయం పూట రాజ్యసభ, సాయంత్రం వేళలో లోక్‌సభను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, 2022-23 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున మాత్రం పార్లమెంట్ ఉభయ సభలు ఉదయం 11 గంటలకు సమావేశమవుతుంది.
అయితే, తొలి రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రపతి హోదాలో ఆయన చేసే చివరి ప్రసంగం ఇదే కావడం గమనార్హం. ఈ యేడాది జూలై నెలలో రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత లోక్‌సభ సమావేశమవుతుంది. ఇందులో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంపత్సర ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖా మంత్రి సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కాగా, ఈ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తొలి రెండు రోజులు ప్రశ్నోత్తరాలు, శూన్య గంట వంటివి ఉండవు. కాగా, ఈ సమావేశాల్లో మరోమారు ఇజ్రాయెల్ స్పై వేర్ పెగాసస్ చర్చకు రానుంది. స్పై వేర్ నిజమేనని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తాజాగా కూడా ఓ కథనాన్ని ప్రచురించింది.