తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మిన్నంటున్నాయి. ఈ వేడుకల్లో అతిముఖ్యమైన ఘట్టమైన జల్లికట్టు పోటీలు రాష్ట్ర వ్యాప్తంకా జరుగుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ పోటీలు మూడు రోజులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, తొలిరోజైన గురువారం అవనియాపురంలో ఈ జల్లికట్టు పోటీలు జరిగాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొని జల్లికట్టు పోటీలను తిలకించారు.
కాగా, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుపై పలు ఆంక్షలు విధించింది. ఇందులో పాల్గొనేవారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ అయ్యుండాలని, ఆ విషయం నిరూపిస్తూ సర్టిఫికెట్ సమర్పించాలని పేర్కొంది. జల్లికట్టులో పాల్గొనే పోటీదారుల సంఖ్యను 150కి పరిమితం చేసింది. పైగా, ప్రేక్షకులు కూడా 50 శాతం మించకూడదని స్పష్టం చేసింది.
మరోవైపు, ఈ పోటీలను తిలకించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి మదురైకు విచ్చేశారు. ఆయన డిఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ నిధితో పాటు.. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరితో కలిసి పాల్గొన్నారు.