కావేరీ జలాలపై ఆందోళనలొద్దు.. సంయమనం పాటించండి.. రాష్ట్రాలదే బాధ్యత: సుప్రీం

గురువారం, 15 సెప్టెంబరు 2016 (18:14 IST)
తమిళనాడు-కన్నడ రాష్ట్రమైన కర్ణాటకలో కావేరి జలాలపై ఆందోళనలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో.. ఇరు రాష్ట్రాల ప్రజలు సంయమనంతో ఉండాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సూచించింది. అంతేగాకుండా ఆందోళనలు, నిరసనల ద్వారా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇంకా అల్లర్లు జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని సుప్రీం వెల్లడించింది. 
 
కావేరి జలాలను తమిళనాడుకు రోజుకు 12వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు నీరు విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కర్ణాటక నీటిని విడుదల చేసిన తొలి రోజే ఆ రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో కర్ణాటకలో నివసించే తమిళులపై, వారి ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. అలాగే తమిళనాడులో కర్ణాటకకు చెందిన వారి ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో ఈ వివాదంపై సుప్రీం కోర్టు స్పందించింది. కావేరి జలాలపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఇంకా ఈ వివాదంపై ప్రజలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి