కాఫీ కింగ్ అదృశ్యం.. కుప్పకూలిన కేఫ్ కాఫీ డే షేర్లు

మంగళవారం, 30 జులై 2019 (16:33 IST)
కాఫీ కింగ్‌గా పేరుగడించిన వీజీ సిద్ధార్థ సోమవారం సాయంత్రం నుంచి అదృశ్యమయ్యారు. ఆయన మంగుళూరుకు సమీపంలోని నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన మృతదేహం కోసం నదిలో వందలాది మంది గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, తమ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారని లేదా ఆత్మహత్య చేసుకున్నారని పుకార్ల నేపథ్యంలో కేఫ్ కాఫీ డేకు సంబంధించిన షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. వీజీ సిద్ధార్థ్ అదృశ్యం కావడం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ షేర్ వాల్యూ 19.99 శాతం పడిపోయింది. మరోవైపు అమ్మకాల ఒత్తిడితో సూచీలు తడబాటుకు గురయ్యాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 289 పాయింట్లు పతనమై 37,397కి పడిపోయింది. నిఫ్టీ 103 పాయింట్లు కోల్పోయి 11,085 వద్ద స్థిరపడింది. 
 
పోరాడే ఓపిక లేదు.. క్షమించండి.. వీజీ సిద్ధార్థ లేఖ 
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన సోమవారం సాయంత్రం మంగుళూరులోని నేత్రావతి నది వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. 
 
అయితే, ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడేముందు... చివరగా కేఫ్ కాఫీ డే సీఎఫ్‌వోతో మాట్లాడినట్టు ఫోన్ కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. అలాగే, తన ఉద్యోగులకు ఆయన ఓ లేఖ కూడా రాశారు. ఈ లేఖలో పలు విషయాలు పేర్కొన్నట్టు సమాచారం. 
 
తన కృషితో 30 వేల మందికి ప్రత్యక్షంగా, 20 వేల మందికి పరోక్షంగా ఉపాధిని కల్పించానని, ఎంత ప్రయత్నించినా సంస్థను లాభాల్లోకి నడపలేక పోయానని వాపోయారు. ఇక ఇక పోరాడే ఓపిక లేదని, అందుకే అన్నీ వదిలేస్తున్నానని, తనను క్షమించాలని అన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఈక్విటీలోని భాగస్వాముల నుంచి తనపై తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. 
 
కొత్త యాజమాన్యానికి ఉద్యోగులంతా సహకరించాలని, వ్యాపారాన్ని కొనసాగించాలని సూచించారు. ఆదాయపు పన్ను మాజీ డైరెక్టర్ జనరల్ తనను ఎంతో వేధించారని ఆరోపించారు. జరిగిన తప్పులన్నింటికీ తనదే బాధ్యతని, తాను జరిపిన డీల్స్ గురించి మేనేజ్‌మెంట్‌‌కు, ఆడిటర్లకు తెలియదన్నారు. తాను ఎవర్నీ మోసం చేయాలనుకోలేదని, చివరకు తాను విఫలమైన వ్యాపారవేత్తగా మిగిలానని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. 
 
మరోవైపు సిద్ధార్థ కోసం నేత్రావతి నదిలో వందలాది మంది గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఇంకోవైపు, ఎస్ఎం కృష్ణ ఇంటికి ముఖ్యమంత్రి యడియూరప్పతో పాటు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వెళ్లి పరామర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు