గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములకు శిక్షణ ప్రారంభించినట్లు వెల్లడించారు. చంద్రయాన్-3 ప్రయోగం వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభించినట్లు వెల్లడించింది. జాబిల్లిపై చేపట్టే ఈ ప్రయోగం 2020లోనే ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించిన నేపథ్యంలో.. ఈ మేరకు ప్రకటన చేశారు ఇస్రో ఛైర్మన్ కె. శివన్.
బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్త ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు శివన్. ల్యాండర్, రోవర్తో కూడిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ మిషన్కు సుమారు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. గగన్‌యాన్ ప్రయోగం కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశామని వెల్లడించారు.
భారత వైమానికి దళానికి చెందిన వీరికి జనవరి మూడో వారం నుంచీ శిక్షణ ప్రారంభమవుతుందని, రష్యాలో ఈ ట్రైనింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఎంపికైన వారి వివరాలను మాత్రం శివన్ వెల్లడించలేదు. 2022లో చేపట్టబోయే ఈ ప్రయోగంలో వ్యోమగాములు కనీసం ఏడు రోజులపాటు అంతరిక్షంలో గడపనున్నారు.
మహిళా వ్యోమగాములను కూడా ఈ ప్రయోగంలో భాగస్వాముల్ని చేయాలని యోచిస్తున్నట్టు ఇస్రో గత ఏడాది ప్రకటించింది. కాగా.. గగన్‌యాన్-2కు సంబంధించి ప్రస్తుతం అనేక ప్రయోగాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది చేపట్టబోయే వాటిలో వ్యోమగాముల శిక్షణ ముఖ్యమైనదని శివన్ తెలిపారు. ఈ ఏడాది ఇస్రో 25 ప్రయోగాలు చేపట్టబోతోందని కూడా ఆయన తెలిపారు.