ప్రేమోన్మాదులు ఎక్కడో కాదు... ఇంటికి ఎదురుగానో, పక్కింట్లోనో లేదంటే వెనుక ఇంట్లోనో ఉంటున్నారు. అందమైన అమ్మాయి కంటికి కనబడితే చాలు... ఇక వేధింపులు మొదలెట్టేస్తున్నారు. ఆమెను పెళ్లాడగల అర్హత తమకు ఉన్నదా లేదా అనేది కూడా చూడటం లేదు. తాము అనుకున్నదే తడవుగా ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టేస్తున్నారు. కాదంటే కాటికి పంపేస్తున్నారు. చెన్నైలో స్వాతి ఉదంతం మరువక మునుపే కోయంబత్తూరులో మరో ఘోరం జరిగింది.
వివరాల్లోకి వెళితే... కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ధాన్య అనే యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఐతే ఆమె ఇంటికి ఎదురుగా కేరళకు చెందిన జహీర్ నివాసముంటున్నాడు. ఎప్పటినుంచో ఆమెపై కన్నేసి ఉంచాడు. ఆమెకు పెళ్లి నిశ్చయం కావడంతో ఇక లాభం లేదనుకుని బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా గమనించి లోనికి ప్రవేశించాడు. తనను పెళ్లాడాల్సిందిగా అడిగాడు.
ఆమె దానికి ససేమిరా అనేసరికి తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా ఆమెను నరికి చంపేశాడు. అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చిన ధాన్య తల్లి కుమార్తె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి బోరమంది. విషయాన్ని పోలీసులకు చేరవేసింది. నిందితుడు కేరళ లోని పాలక్కడ్ కు చెందినవాడిగా గుర్తించారు. యువతిని చంపిన అతడు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.