ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. పిల్లలులేని ఓ వ్యక్తి మూఢనమ్మకంతో బతికున్న కోడిపిల్లను మింగడంతో అది కాస్త గొంతులో ఇరుక్కుని పోయింది. దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు చనిపోయినా ఆ కోడిపిల్ల బతికే ఉండటం గమనార్హం.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూరికి చెందిన ఆనంద్ యాదవ్‌కు వివాహమై చాలా ఏళ్లు అయినా సంతానం లేదు. దాంతో పిల్లలు పుట్టే మార్గం చూపమని ఓ తాంత్రికుడిని సంప్రదించాడు.
అతడి సూచన మేరకు బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. అది అతడి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కుప్పకూలాడు. దాంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆనందన్‌ను అంబికాపూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టంలో అతడి గొంతులో కోడిపిల్లను వైద్యులు గుర్తించారు.