కన్నీళ్లను దిగమింగి భర్త చావు వార్తను చదివి ఆపై భోరుమన్న ఆ మాన్య యాంకర్
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (03:21 IST)
మేరా నామ్ జోకర్ సినిమాలో గుండెను పట్టేసే దయనీయ దృశ్యం మనందరికీ గుర్తు ఉండే ఉంటుంది. భర్తను సర్కస్ విన్యాసాల్లోనే పొగొట్టుకున్న ఆ తల్లి తన కుమారుడు కూడా అలాగే సర్కస్‌లో విన్యాసం చేస్తూండగా ఆందోళనతో చూస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి ప్రమాదవశాత్తూ కుమారుడు కిందికి జారతే ఆ షాక్‌తో ఆ తల్లి గుండె ఆగిపోయినప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన కొడుకు తన విన్యాసాలను వదిలి రాలేక అలాగే స్టేజ్ మీద మా.. మా అంటూ అప్పుడే కోల్పోయిన తమ అమ్మగురించి పాట రూపంలో వ్యక్తపరిచిన ఆ బాధను చూస్తున్న కోట్లాది ప్రేక్షకులు కదిలిపోయి ఏడ్చేసిన దృశ్యం అది. అది నటన.
కానీ జీవితంలో అలాంటి దృశ్యం మరోచోట మరో సందర్భంలో జరిగితే. తన భర్త చనిపోయిన వార్తను తానే యాంకర్ స్థానంలో ఉండి చదవాల్సి వస్తే. మామూలు మనిషులకు అయితే అంతకు మించిన నరకం మరొకటి ఉండదు. కానీ ఆ యాంకర్ తనభర్త చావు వార్తను తాను ప్రకటించాల్సి వచ్చినప్పుడు కూడా తానున్న స్థానాన్ని మర్చిపోలేదు. వార్తలను అందించడం అనే బాధ్యతను గుర్తు చేసుకుంటూనే ప్రమాదంలో భర్త చనిపోయిన వార్తను యాంకర్‌గా నిర్వేదంగా చదివి వినిపించి ఆ కార్యక్రమం అయిన తర్వాతే న్యూస్ రూమ్ నుంచి వచ్చి తన భర్త మరణవార్తను ప్రకటించి విషాదంలో మునిగిపోయిన ఘటనకు చత్తీస్‌ఘడ్ వేదిక అయింది.
చత్తీస్‌గడ్‌లో ఐబీసీ-24 అనే ప్రయివేట్ చానల్ న్యూస్ రీడర్ సుప్రీత్ కౌర్ శనివారం ఉదయం వార్తల్లో తన భర్త ప్రమాదంలో మరణించిన వార్తనే చదవాల్సి ఉంటుందని ఊహించలేకపోయంది. ఉదయం బ్రేకింగ్ న్యూస్‌లో వార్తను చదువుతున్నప్పుడు గానీ రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయిన విషయం తెలియలేదు. మహాసముద్ జిల్లాలో పితారా ప్రాంతంలో రెనాల్ట్ డస్టర్ కారు ప్రమాదంలో చిక్కుకుందని రిపోర్టర్ చెబుతున్నప్పడే ఆ ప్రమాదంలో చనిపోయింది తన భర్తే అని గ్రహించిన సుప్రీత్ షాక్‌కు గురవుతూనే లైవ్‌లో ఆ వార్తను ఎలాంటి ఉద్వేగానికి లోనవకుండానే నిర్భావంతో చదివింది.
రేనాల్ట్ డస్టర్ కారులో ప్రయాణిస్తున్న అయిదుగురిలో ముగ్గురు చనిపోయారని వారిని ఇంకా గుర్తుపట్టలేదని రిపోర్టర్ లైవ్‌లో చెబుతున్నప్పుడు ఆ ప్రమాదంలో చనిపోయింది తన భర్తే కావచ్చని ఆమె ఊహించింది. ఎందుకంటే అదే రూట్‌లో తన భర్త ఆ సమయంలో ప్రయాణిస్తున్నట్లు ఆమెకు తెలుసు. కానీ ఎలాంటి బాధాసూచనను కనిపించనివ్వకుండా ఆ వార్తను అలాగే చదివింది. బులెటిన్ పూర్తి చేసిన తర్వాత బోరున విలపించింది. బంధువులకు ఫోన్ చేసి జరిగిన ధారుణాన్ని తెలుసుకొంది.
ఆ టీవీ చానల్ సీనియర్ ఎడిటర్ ఆ సంఘటన గురించి మాట్లాడుతూ ఆ యాంకర్ నిబద్ధతకు తామంతా గర్వపడుతున్నామని చెప్పారు. ఆమె ఆసాధారణ ధైర్య సాహసాలు కల మహిళ. ఆమెను చూసి మేమంతా గర్విస్తున్నాం. కానీ ఈరోజు జరిగింది చూసి మేం షాక్‌కు గురయ్యాం అని చెప్పారు. ప్రమాదానికి గురైంది తన భర్త వాహనమే కావచ్చని ఆమె గ్రహించింది. వార్తల బులెటిన్ చదవటం పూర్తి చేసిన తర్వాతే ఆమె స్టూడియో బయటికి వచ్చి అప్పుడు మాత్రమే తన బంధువులకు ఆ వార్త చెప్పడానికి ఫోన్ చేసిందన్నారు.
ఆమె వార్తలు చదువుతున్నప్పుడే ఆ ప్రమాదంలో చనిపోయింది ఆమె భర్తేనని టీవీ చానల్ సిబ్బందికి తెలిసింది. కాని వెంటనే ఆమెకు చెప్పలేకపోయాం. చెప్పే ధైర్యం మాకు లేకపోయింది అని చానల్ ఎడిటర్ వివరించారు.