చీఫ్ జస్టీస్ రంజన్ గొగోయ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మాజీ ఉద్యోగిని ఒకరు జడ్జీలకు అఫిడవిట్ రూపంలో ఓ లేఖ రాసిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సీజేఐ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటుచేశారు. ఈ విషయంపై విచారణ సందర్భంగా జస్టిస్ గొగోయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
తాను జడ్జీగా 20 ఏళ్లు పనిచేశాననీ, తన బ్యాంకు బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఉండగా, పీఎఫ్ సొమ్ము రూ.40 లక్షలు మాత్రమే ఉందని గొగోయ్ తెలిపారు. 'డబ్బు విషయంలో తనను దెబ్బకొట్టలేని కొన్ని శక్తులు ఈ ఆరోపణలు చేయిస్తున్నాయి. ఇప్పుడు భారత న్యాయవ్యవస్థ చాలా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. నాపై వచ్చిన ఆరోపణల వెనుక చాలా బలీయమైన శక్తులు ఉన్నాయి' అని వ్యాఖ్యానించారు.
కాగా, రంజన్ గొగోయ్‌పై ఓ మాజీ మహిళా ఉద్యోగిని సంచలన ఆరోపణలు చేసింది. రంజన్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించింది. ఈ మేరకు జూనియర్ కోర్టు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 35 యేళ్ల మహిళ ఆరోపించింది. తన నివాస కార్యాలయంలో రంజన్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు దిగారని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులోని 22 మంది జడ్జీలకు ఓ అఫిడవిట్‌ను పంపించారు. పైగా, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.