సినిమా థియేటర్లలో జాతీయ గీతం అంశంపై దేశవ్యాప్త చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. దీనిపై ప్రముఖులంతా తలా ఒక మాట చెప్తూనే ఉన్నారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ గతేడాది సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. అయితే థియేటర్లలో జాతీయ గీతాన్ని పాడించడంపై సినీ నటులు కమల్ హాసన్, అరవింద్ స్వామి, సోను నిగమ్ వంటి వారు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే జాతీయ గీతాన్ని ఎక్కడ ప్రసారం చేసినా లేచి నిలుచుని జాతికి గౌరవం ఇవ్వాల్సిందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో చైనా కూడా జాతీయ గీతాన్ని గౌరవించాల్సిందేనని లైన్లోకి వచ్చింది. అంతేగాకుండా చైనా తమ జాతీయజెండాకు సంబంధించి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. బహిరంగ ప్రదేశాల్లో తమ జాతీయ జెండాను అవమానించినా, జాతీయ గీతాన్ని గౌరవించకపోయినా మూడేళ్లు జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం త్వరలో చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టనుంది.