లోక్‌సభలో పొగతో అలజడి ఘటన.. కేంద్రం కీలక నిర్ణయం

గురువారం, 21 డిశెంబరు 2023 (15:45 IST)
ఇటీవల లోక్‌సభలోకి దుండగులు ప్రవేశించి రంగుల పొగతో సృష్టించిన అలజడి ఘటన దేశ ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. ఈ ఘటనతో పార్లమెంట్‌ భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై పార్లమెంట్‌ భవన సముదాయంలో సమగ్ర భద్రత బాధ్యతలను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌‌కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రభుత్వ ర్గాలు గురువారం వెల్లడించాయి.
 
పార్లమెంట్ భవన సముదాయంలో సర్వే చేపట్టాలని కేంద్ర హోంశాఖ బుధవారం ఆదేశించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ సర్వే అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని మోహరించనున్నట్లు తెలుస్తోంది. సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన గవర్నమెంట్‌ బిల్డింగ్‌ సెక్యూరిటీ యూనిట్‌ నిపుణులు, ఫైర్‌ యూనిట్‌ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్‌ భద్రతా బృందాలతో కలిసి ఈ వారాంతంలో సర్వే చేపట్టనున్నారు.
 
ఈ ప్రక్రియ అనంతరం.. పాత, కొత్త పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లు, వాటి అనుబంధ భవనాలు అన్నింటినీ సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కిందకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీని కిందే ప్రస్తుతం పార్లమెంట్‌ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్‌, దిల్లీ పోలీసు, సీఆర్పీఎఫ్‌కు చెందిన పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌ బృందాలు కూడా పనిచేయనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
 
కాగా, ఈ నెల 13వ తేదీన పార్లమెంట్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. లోక్‌సభలో జీరో అవర్‌ జరుగుతుండగా.. ఇద్దరు దుండగులు విజిటర్స్‌ గ్యాలరీలో నుంచి సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. రంగుల పొగను వెదజల్లారు. అదే సమయంలో పార్లమెంట్ భవనం వెలుపల ఇద్దరు వ్యక్తులు స్మోక్‌ క్యానిస్టర్లతో ఆందోళన చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు