భారత రాజ్యాంగాన్ని కాపాడాలాంటే బలమైన వ్యక్తి కావాలని, దానికి సరైన వ్యక్తి రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లను దక్కించుకుని, సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఖరారు చేసింది. అయితే, రాహుల్ గాంధీ మాత్రం తన నిర్ణయాన్ని వెల్లడించారు. దీనిపై మల్లికార్జున ఖర్గే స్పందించారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నికైనట్టు గుర్తు చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీను కోరింది. అయితే దీనిపై రాహుల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 'భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే బలమైన ప్రతిపక్షం ఎంతో అవసరం. అందుకే పార్లమెంటులో ప్రతిపక్ష నేత హోదాకు రాహుల్ గాంధీ సరైన వ్యక్తి. దీనిపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది' అని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.
మరోవైపు, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ విజయం సాధించడంతో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఈ విషయాన్ని హస్తం పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కీలక నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నుంచి ఖర్గే మాత్రమే ప్రమాణస్వీకారోత్సవానికి రానున్నట్లు స్పష్టమైంది. మరోవైపు.. కూటమిలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని సమాచారం.