దేశంలో మళ్లీ 30 వేలు దాటిన కరోనా కొత్త కేసులు

గురువారం, 16 సెప్టెంబరు 2021 (10:43 IST)
దేశంలో కరోనా కేసులు మళ్లీ 30వేల మార్కును దాటాయి. మృతుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.
 
24 గంటల వ్యవధిలో 15,79,761 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..30,570 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కేసులు ముందురోజు కంటే 12 శాతం పెరిగాయి.

మహమ్మారి కారణంగా నిన్న 431 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3,33,47,325 మందికి వైరస్‌ సోకగా.. 3,25,60,474 కోలుకున్నారు. 4,43,928 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

3.42 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 38 వేల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 1.03 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.64 శాతానికి చేరింది.
 
కేరళలోనే 17 వేల కేసులు.. దేశంలో నమోదవుతోన్న కరోనా కొత్త కేసుల్లో సగానికి పైగా కేరళ రాష్ట్రంలోనే బయటపడుతున్నాయి. అక్కడ నిన్న 17,681 మందికి వైరస్ సోకింది. 208 మంది మరణించారు. మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి.
 
ఇక మహారాష్ట్రలో 3,783 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కూడా కరోనా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ 1,402 మంది కరోనా బారినపడ్డారు.

76 కోట్ల టీకా డోసుల పంపిణీ..
గత కొంతకాలంగా టీకా పంపిణీలో వేగం కనిపిస్తోంది. నిన్న 64.51లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 76 కోట్ల మార్కును దాటింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు