దేశంలో కరోనా ఉధృతి - ఆరు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
గురువారం, 2 జులై 2020 (10:37 IST)
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలకు దాటిపోయాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మరో 19148 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,04,641కు చేరాయి. అలాగే, గడచిన 24 గంటల్లో 507 మంది చనిపోయారు.
ఈ మృతులతో కలుపుకుని దేశంలో మొత్తం మృతుల సంఖ్య 17,834కి పెరిగింది. 2,26,947 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,59,860 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, బుధవారం వరకు దేశంలో మొత్తం 90,56,173 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. బుధవారం ఒక్కరోజులో 2,29,588 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మరింత పెరిగిపోతోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,08,03,599 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,18,968కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 43,45,614 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 64,57,985.
అమెరికాలో కరోనా ఉద్ధృతికి ఏ మాత్రం అడ్డుకట్టపడట్లేదు. గత 24 గంటల్లో కొత్తగా 52,898 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 27,79,953గా ఉంది. అమెరికాలో మృతుల సంఖ్య 1,30,798కి చేరింది. ఇప్పటివరకు 11,64,680 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రుల్లో 14,84,475 మంది కరోనా రోగులకు చికిత్స అందుతోంది.
అమెరికా తర్వాత బ్రెజిల్‌లో కరోనా ఉద్ధృతి అధికంగా ఉంది. ఆ దేశంలో బుధవారం ఒకేరోజు 45,000 కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య మొత్తం 14,53,369గా ఉంది. ఇప్పటివరకు 60,713 మంది మరణించగా, 5,65,790 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 8,26,866 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు.