గురువారం ఉదయం ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో క్యాబిన్ సిబ్బంది అజాగ్రత్త వలన ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ముంబైలో విమానాన్ని దింపేసి ప్రయాణికులకు చికిత్స అందించారు. విమానం టేకాఫ్ వుతున్నప్పుడు బ్లీడ్ స్విచ్ నొక్కడం మర్చిపోయిన కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే, గురువారం ఉదయం జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జెట్ ఎయిర్వేస్ 9W 697 విమానం టేకాఫ్ సమయంలో కాక్‌పిట్ సిబ్బంది అజాగ్రత్త కారణంగా క్యాబిన్లో పీడనం బాగా పడిపోయిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు చెందిన అధికారులు తెలిపారు. విమానంలో 166 మంది ప్రయాణిస్తుండగా, అందులో 30 మంది ఈ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కొంతమందికి ముక్కుల్లో నుండి రక్తం రాగా, కొందరికి చెవుల్లో నుంచి రక్తం కారింది, ఇంకొంతమందిని తలనొప్పి పీడించింది. వీరందరికీ ఎయిర్‌పోర్టులోనే చికిత్స అందించారని అధికారులు తెలిపారు.