చాటింగ్ కొంపముంచింది.. తల్లి వెళ్ళిపోయింది.. తండ్రి ఉరేసుకున్నాడు.. బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తూ?

శనివారం, 12 జనవరి 2019 (10:29 IST)
స్మార్ట్‌ఫోన్‌, సోషల్ మీడియా పుణ్యంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వాట్సాప్ మెసేజ్‌లు, చాటింగ్‌ల ద్వారా పచ్చని జీవితంలో నిప్పులు పోస్తున్నాయి. తాజాగా వాట్సాప్ చాటింగ్‌ ప్రేమించి పెళ్లాడిన  వారిని దూరం చేసింది. నెలలు నిండని పసివాడిని తండ్రికి దూరం చేశాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులోని పేట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా పులివెందుల సమీపంలోని గోటూరుకు చెందిన ఎర్రగొండు చరణ్ తేజ్ రెడ్డి (25) ఐదేళ్ల క్రితం పావని అనే యువతిని ప్రేమించాడు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడాది వయస్సున్న కుమారుడు వున్నాడు. కానీ కొంతకాలంగా భార్య సెల్‌ఫోన్‌కు తరచూ మెసేజ్‌లు వస్తుండడం, ఆమె రహస్యంగా చాటింగ్ చేస్తుండడాన్ని చూసిన చరణ్ ఆమెను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పావని కుమారుడిని భర్త వద్దే వదిలేసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.
 
భార్య తనను విడిచి వెళ్లిపోవడం, కుమారుడిని చూసుకోవాల్సి రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చరణ్ గురువారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పావనికి విషయం చెప్పారు. ఆమె నమ్మకపోవడంతో చరణ్ మృతదేహాన్ని ఫొటో తీసి వాట్సాప్ చేశారు. అయినప్పటికీ ఆమె శుక్రవారం సాయంత్రానికి గానీ స్పందించలేదు.
 
స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ కనిపించకపోవడంతో ఏడాది చిన్నారి గుక్కపట్టి ఏడవటం స్థానికుల మనస్సును కలచివేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు