ఫేస్ బుక్ పరిచయం... వగలుపోతూ అడిగేసరికి సమర్పించుకున్నాడు...

గురువారం, 14 మార్చి 2019 (21:58 IST)
సోషల్ మీడియా ద్వారా లేదా ఆన్‌లైన్ వివాహ వేదికల ద్వారా పరిచయం చేసుకుని అమ్మాయిలను నమ్మించి మోసం చేసే సైబర్ నేరగళ్లను ఇప్పటివరకూ చాలాసార్లు చాశాం. ఇప్పుడు కొత్తగా ఈ తరహాలోకి అమ్మాయిలు దిగారు. విదేశాలలో స్థిరపడ్డాను, భారత సంస్కృతిపై మంచి గౌరవం ఉంది, మంచి వ్యాపారం చేస్తున్నాను, డాక్టర్, ఇంజినీర్ వంటి హోదాలు చెప్పి ఆశలు చూపి అబ్బాయిలను వలలో వేసుకుంటున్నారు. 
 
డబ్బు కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ముక్కుమొహం తెలియని అమ్మాయిలు పెట్టే అందమైన ఫోటోలు, వారు చెప్పే మాటలు నమ్మి స్నేహం చేసి చివరికి మోసపోతున్నారు అబ్బాయిలు. వ్యక్తిగత వివరాలు తెలుసుకుని ఫేస్‌బుక్, షేర్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలలో పోస్ట్‌లు పెడుతున్నారు. మీ కోసం కానుకలు వగైరా పంపుతున్నామని చెప్పి లక్షలకు లక్షలు స్వాహా చేస్తున్నారు. 
 
బాధితుల నుండి ఇలాంటి ఫిర్యాదులు మరిన్ని అందుతుండటంతో అధికారులు ఇలాంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. మహ్మద్‌ ముసా ఇనాయత్‌ అలీ టోలీచౌకీలో నివాసముంటున్నాడు. ఐస్‌క్రీమ్ షాప్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఐదు నెలల క్రితం అతనికి బెల్లీలీ అనే యువతి ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. తాను అమెరికాలో ఉంటున్నానని, భారతీయులతో స్నేహం చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని నమ్మించింది. ఆ పరిచయం కాస్త వాట్సప్ చాట్ వరకూ వెళ్లింది. 
 
జనవరి 31, 2019న బెల్లీలీ ఇనాయత్‌‌కి ఫోన్ చేసింది. అమెరికాలో ఒంటరిగా ఉంటున్నానని, ఇక్కడ ఉన్న వ్యక్తులు స్నేహపూర్వకంగా లేరని చెప్పింది. తన అతిథిగా అమెరికా రావాలని కోరింది. ప్రయాణ ఖర్చులకు ఏడు వేల డాలర్లు కానుకగా పంపిస్తానని చెప్పింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫోన్‌ వస్తుందని చెప్పింది. అనుకున్న విధంగానే ఫిబ్రవరి 2న శృతి అనే మహిళ ఇనాయత్‌కి ఫోన్ చేసింది. మీకు ఏడు వేల డాలర్ల పార్సిల్ వచ్చిందని దానిని మీ చిరునామాకి పంపాలంటే కస్టమ్స్ సుంకం క్రింద 30 వేల రూపాయలు చెల్లించాలని చెప్పింది. 
 
ఆమె చెప్పిన ఖాతాలో అతను డబ్బు జమ చేసాడు. కాసేపటి తర్వాత ఫోన్ చేసి జిఎస్‌టి, ఆదాయపు పన్ను కలిపి 75 వేలు కట్టాలని వివరించింది. అది కూడా అతను జమ చేసాడు. ఎన్నిరోజులైనా పార్సిల్ ఇంటికి రాకపోవడంతో బెల్లీలీకి ఫోన్ చేశాడు. ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో శృతికి ఫోన్ చేశాడు. ఆ నంబర్ నుండి కూడా ప్రతిస్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఇనాయత్ పోలీసులను ఆశ్రయించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు