తుఫానుగా మారనున్న 'మాండస్'

మంగళవారం, 6 డిశెంబరు 2022 (09:02 IST)
దక్షిణ అండమాన, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. దీనికి "మాండస్" అనే పేరు పెట్టారు. ఇది మంగళవారం వాయుగుండంగా, తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పైగా, ఇది తీర ప్రాంతంపై విరుచుకుపడే అవకాశం ఉందని, అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మత్స్యుకారులు ఎవ్వరూ సముద్రంలోకి చేపల వేటకు పొవద్దని ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది. 
 
కాగా, మంగళవారం సాయంత్రం పశ్చిమ, వాయువ్య దిశల్లో గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలో చెదురుముదురు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాండస్ అని పేరు పెట్టింది. ఇది ఈ నెల 7, 8 తేదీల్లో తీరం వైపు దూసుకొస్తుందని తెలిపింది. అయితే, ఈ తుఫాను మాత్రం 8వ తేదీన తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది. 
 
ఈ తుఫాను ప్రభావం కారణంగా తమిళనాడులోని తెన్‌కాశి, తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. ఈ తుఫాను ప్రభావం రాయలసీమ, కోస్తాంధ్రపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు